రామవరం, జూన్ 24 : చాలీచాలని మరుగుదొడ్ల లేమితో విద్యార్థినులు నానా అవస్థలు పడుతున్నారు. రుద్రంపూర్ ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిలు మరుగుదొడ్లు లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో నిర్మించిన మరుగుదొడ్లు నిరుపయోగంగా మారిపోయాయి. ప్రస్తుతం రెండు మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థినిలు ఉపయోగించుకోవాలి. ఆ మరుగుదొడ్లుకు కూడా నీటి సౌకర్యం సరిగా ఉండదని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినిలు రుతుక్రమం సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలుర పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తమకు ఒక్క మరుగుదొడ్డి కూడా లేదని, అత్యవసరమైతే కళాశాల వెనుకాల కిరాయికి ఉన్నటువంటి విద్యార్థుల రూమ్స్ లోనికి వెళ్లాల్సి పరిస్థితి ఏర్పడిందని, కొన్ని సందర్భాల్లో ఓనర్లు మందలిస్తున్నట్లు వాపోయారు
విద్యార్థుల కోసం గతంలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లను తాత్కాలికంగా బాగు చేయించి వినియోగంలోకి తెస్తే కొత్తవాటిని నిర్మించేంత వరకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు పూర్తయితే ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఇప్పుడున్న విద్యార్థులకే తగినని మరుగుదొడ్లు లేవని, వారు వస్తే పరిస్థితి ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఐటిఐ కొత్త కోర్సుల కోసం కొత్త భవనాలు కడుతున్నారని ముందుగా భవనాల కంటే మరుగుదొడ్ల అవసరం ఉందని విద్యార్థి సంఘాల నాయకులను అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులు ఎదుర్కొంటున్న కనీస సౌకర్యాన్ని కల్పించాలని కోరుతున్నారు.
ఐటిఐలో తగినన్ని మరుగుదొడ్లు లేకపోవడంతో ఆ ఇబ్బందులను ఎదుర్కోలేక చాలామంది అమ్మాయిలు మంచినీళ్లు తాగడం మానేశారని దాంతో వారికి యూరినల్ ఇన్ఫెక్షన్స్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయంపై ఐటిఐ ప్రిన్సిపాల్ గోనెల రమేశ్‌ను వివరణ కోరగా మరుగుదొడ్ల సమస్య వాస్తవమేనని, ఇప్పటికే జిల్లా కలెక్టర్ ను రెండుసార్లు కలిసి సమస్యను వారికి వివరించామని, ప్రభుత్వ నుండి రావాల్సిన బడ్జెట్ కూడా రావడం లేదన్నారు. సింగరేణి వారిని సిఎస్ఆర్ నిధుల ద్వారా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరుతూ లేఖ కూడా అందించినట్లు తెలిపారు.