కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 08 : ఆర్ఎస్ఎస్, బీజేపీ ఫాసిస్టు మతోన్మాద విధానాలను అరికట్టాలని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకుడు కె.రంగారెడ్డి. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం మాట్లాడారు. దేశ కార్మిక వర్గం భద్రత కోసం, మంచి వేతనం కోసం, ట్రేడ్ యూనియన్ హక్కుల కోసం తాము ఉద్యమిస్తుంటే, మరోవైపు రైతులు ఎంఎస్పీ కోసం, గిట్టుబాటు ధరల చట్టపరమైన హామీ, రుణాల రద్దు డిమాండ్లతో పోరాడుతుంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ మాత్రం ఔరంగ జేబు సమాధి గొడవను రేకెత్తించి, అమాయక హిందూ ప్రజలను రెచ్చగొట్టి, ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ఆర్ఎస్ఎస్, బీజేపీ సమాజాన్ని అత్యంత విషపూరితం చేస్తూ ఓట్లు దండుకుని ధ్వంసం చేస్తున్నట్లు వారు విమర్శించారు. మోదీ ప్రభుత్వం అప్పటికే ఉన్న 44 కార్మిక చట్టాలు రద్దుచేసి వాటి స్థానంలో 4 కార్మిక చట్టాలను ప్రవేశపెట్టిందని, కానీ నాలుగు కార్మిక కోడులను తరచి చూస్తే నరేంద్ర మోదీ మాటలు జుమ్లా తప్పా మరోటి కాదని నిర్ధారణకు రావచ్చు అన్నారు. మోదీ ప్రభుత్వ దాడి కార్మిక వర్గం, రైతులకే పరిమితం కాలేదని విద్యపై కూడా దాడి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో ఎటువంటి చర్చ లేకుండా కొత్త విద్యా విధానం 2020ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
నాలుగు కార్మిక లేబర్ కోడ్లు, వ్యవసాయ మార్కెటింగ్ బిల్లు, కొత్త విద్యా విధానాలకు వ్యతిరేకంగా బహుళ సమాఖ్యవాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్య రక్షణ కోసం, నవ్య ఉదార వాద ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ నాయకురాలు చండ్ర అరుణ, జిల్లా కార్యదర్శి సభ్యులు కె.కల్పన, జాటోత్ కృష్ణ, గోకినపల్లి ప్రభాకర్, జిల్లా నాయకులు కల్లూరి కిశోర్, బుర్ర వెంకన్న, కోడం దుర్గ, వై.సావిత్రి, టీయూసీఐ జిల్లా సహాయ కార్యదర్శి పెద్దబోయిన సతీశ్, సాయి, మునిగేల మహేశ్వరి, నకిరేకంటి నాగేశ్వరరావు, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకుడు మునిగేల శివ, పూణేం రమేశ్, జర్పుల సుందర్ కోటమ్మ పాల్గొన్నారు.