సుజాతనగర్ : మహిళను కొట్టి గాయపరిచిన కేసులో రౌడీ షీటర్ మాలోత్ విజయ్ కుమార్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీసులు మంగళవారం రాత్రి రిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..సుజాతనగర్ మండలం హరిలాల్ తండా గ్రామానికి చెందిన మాలోత్ అరుణ అనే మహిళను పాత కక్షలు మనసులో పెట్టుకొని అదే గ్రామానికి చెందిన రౌడీషీటర్ మాలోత్ విజయకుమార్, అతని తల్లి మాలోత్ గోపి, అదే గ్రామానికి చెందిన మాలోత్ సంతోష్ ఈనెల 3న బీరు సీసాతో దాడి చేసి కొట్టారని, గొడవను ఆపడానికి వచ్చిన మాలోత్ నారాయణ, బద్రి, సుశీల లను కూడా కొట్టి గాయపరిచినారని సుజాతనగర్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు.
ఈ కేసు విషయమై సుజాతనగర్ ఎస్ఐ ఎం. రమాదేవి కేసు దర్యాప్తు చేసి మాలోత్ విజయ్ కుమార్, మాలోత్ సంతోష్, మాలోతు గోపీలను మంగళవారం అరెస్టు చేసి కొత్తగూడెంలోని కోర్టు ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. ఎవరైనా గొడవలకు పాల్పడితే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.