– ఎం.చంద్రపురంలో జోరుగా రేషన్ దందా
– గ్రామ శివారుల్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం
కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఏప్రిల్ 09 : పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. పేద ప్రజలకు సన్న బియ్యం అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడం అక్రమ బియ్యం వ్యాపారులకు వరంగా మారింది. లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని ఎం.చంద్రపురం గ్రామ శివారులో అక్రమంగా బియ్యం వ్యాపారం చేస్తున్న కొందరు ప్రముఖులు క్వింటాళ్లలో బియ్యాన్ని నిల్వ చేశారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని గడిస్తున్నారు. అక్రమ వ్యాపారులు ఒక ముఠాగా ఏర్పడి రాత్రులు బియ్యం దందాను కొనసాగిస్తున్నారు. కొత్తగూడెంకు చెందిన కొందరు యువకులు ఒక నాయకుడి అండదండలతో వ్యాపారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సివిల్ సప్లై అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా బియ్యం అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.