రామవరం, ఏప్రిల్ 16 : అధికారుల, కార్మికుల ప్రమోషన్ విషయంలో విజిలెన్స్ పేరుమీద ఏదో చిన్న చిన్న తప్పులు ఉంటే సంవత్సరాల పాటు ప్రమోషన్ రాకుండా పెండింగ్ పెడుతున్న అంశం తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో త్వరలోనే సింగరేణిలో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నట్లు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్ర తెలిపారు. సింగరేణి కాలనీస్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రెటరీ అంతోటి నాగేశ్వరావు, సంఘం నాయకులు బుధవారం న్యూఢిల్లీ లోని లోక్‌నాయక్ భవన్లో వడ్డేపల్లి రామచంద్రను మర్యాద పూర్వకంగా కలిశారు. బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన “జర్నీ ఆఫ్ ది 75 ఇయర్స్ కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా” అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు తమను ఆహ్వానించడంపై ఈ సందర్భంగా వారు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
వడ్డేపల్లి రామచంద్ర మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ కార్మికులు, వ్యక్తులకు ఏమైనా అన్యాయం జరిగితే నేరుగా తనను కలువొచ్చని చెప్పారు. సింగరేణిలో సంవత్సరాల కాలం ప్రమోషన్ రాకుండా పెండింగ్‌లో పెడుతున్న అంశం తన దృష్టికి వచ్చినదన్నారు. తానే సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.బలరాం నాయక్‌తో మాట్లాడి అధికారుల ప్రమోషన్ విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరెపల్లి రాజేందర్, బందెల విజేందర్, మొగిలిపాక రవికుమార్, చెరిపెల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.