కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 30 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 58 నుండి 61 సంవత్సరాలకు పెంచిన విషయం తెలిసిందే. అదే విధంగా సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం చేసిన వినతికి సానుకూలంగా స్పందించి సింగరేణి కార్మికుల వయో పరిమితిని 60 నుండి 61 సంవత్సరాలకు పెంచింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 61 నుండి 62 సంవత్సరాలకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నందున సింగరేణి కార్మికుల వయో పరిమితిని కూడా 61 నుండి 62 సంవత్సరాలకు పెంచాలని సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రెటరీ అంతోటి నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం కార్మికుల ఆరోగ్య స్థితి, జీవన ప్రమాణాలు మెరుగవడంతో వయో పరిమితి పెంపు వారికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచిన విషయం ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ నిర్ణయం అమలుకు ప్రత్యేకంగా కోల్డ్ ఏరియాలో బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రులు, ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్సీ/ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ , అలాగే ఖమ్మం ఎంపీ రామ్ సహాయం రఘురాం రెడ్డి , పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ , మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ తమ మద్దతు అందించాలని కోరారు. ఈ సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు బందెల విజయేందర్, చెరుపల్లి నాగరాజు, మొగిలిపాక రవికుమార్, తోట రవికుమార్, సలిగంటి తిరుపతి, కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.