– కొత్తగూడెం ఏరియా జీఎంకు రుద్రంపూర్ సర్పంచ్ వినతి
రుద్రంపూర్, ఆగస్టు 21 : పైప్లైన్ పనుల కారణంగా రుద్రంపూర్ ప్రధాన రహదారి దెబ్బతిన్నందున దానిని పునరుద్ధరించడంతో పాటు గ్రామంలోని అంతర్గత రహదారుల నిర్మాణం కూడా చేపట్టాలని కోరుతూ రుద్రంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోత్ కేస్లీ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ తోట రాజు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్ వెంకటరమణను శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి, పూల మొక్కలు బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పలు సమస్యలను జిఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా రుద్రంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో సింగరేణి యాజమాన్యం చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, 2020-21 నుండి రావాల్సిన బకాయిలు, బందెలదొడ్డి నిర్మాణానికి అవసరమైన స్థలం, నిర్మాణ పనులు తదితర అంశాలను జీఎం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సింగరేణి ప్రభావిత ప్రాంతమైన గ్రామ పంచాయతీ అభివృద్ధికి సింగరేణి యాజమాన్యం తమ సహాయ సహకారాలు అందిస్తుందని, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని జీఎం సీహెచ్. వెంకటరమణ హామీ ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు ఆరెల్లి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి నరేందర్ పాల్గొన్నారు.