కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 06 : ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, మధ్యాహ్న భోజన, హాస్టల్ వర్కర్స్, అంగన్వాడీ, హెల్త్, మున్సిపల్, గ్రామ పంచాయతీ తదితర స్కీం వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఐఎన్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.సీతారామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐఎన్టీయూ నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్మిక శాఖ అధికారి షరీఫుద్దీన్ను కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేసి మాట్లాడారు. కనీస వేతనంతో పాటు 8 గంటల పని విధానం, ఈఎస్ఐ, పీఎఫ్, సామాజిక భద్రత, చట్టబద్దమైన సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత 20 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న మధ్యాహ్న భోజన, హాస్టల్ వర్కర్స్ సమస్య పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని అధికారులను కోరారు.
పరిశ్రమలలో పని చేస్తున్న మహిళలు అనేక రకాలుగా వేధింపులకు గురవుతున్నారని, వారికి రక్షణ కల్పించాలని, సంఘటిత, అసంఘటిత రంగాల్లో దేశంలో సుమారు 70 కోట్ల మంది కార్మికులు పని చేస్తున్నారని, వారి ప్రయోజనాల కోసం ఆలోచన చేయాలని విన్నవించారు. కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న వైఖరి వల్ల కార్మికులు అభద్రతాభావానికి లోనవుతున్నారని, కార్మిక సంక్షేమం కోసం పాటుపడకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా కండ్లు తెరిచి కార్మిక సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, లేనిపక్షంలో ఆందోళనలను కొనసాగిస్తామని హెచ్చరించారు. వినతి పత్రం అందజేసిన వారిలో నాయకులు గౌని నాగేశ్వరరావు, మల్లికార్జునరావు, మంకెన వెంకటేశ్వరరావు, శరత్ ఉన్నారు.