పాల్వంచ, నవంబర్ 13 : కేటీపీఎస్ కాంప్లెక్స్ పర్యటనకు విచ్చేసిన టీజీ జెన్కో డైరెక్టర్ (సివిల్) ఎ.అజయ్ ను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (TRVKS ) జెన్కో కార్యదర్శి ముత్యాల రాంబాబు ఆధ్వర్యంలో గురువారం కలిసి ఘనంగా సన్మానించి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ముందుగా కేటీపీఎస్ 7వ దశకు సుమారు 724 క్వార్టర్లు శాంక్షన్ చేసినందుకు జెన్కో యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కేటీపీఎస్ 7వ దశకు సంబంధించి కార్మికుల క్వార్టర్లు హ్యాండ్ ఓవర్ చేసిన వారికి హెచ్ఆర్ఏ అలవెన్స్ శాంక్షన్ చేయాలని డైరెక్టర్ ని కోరారు. కేటీపీఎస్ కాలనీలోని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు పూర్తిగా పాడైనందున వాటి మరమ్మతుకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. కేటీపీఎస్ 7వ దశ అకౌంట్స్ విభాగం వారికి నూతన బిల్డింగ్ నిర్మాణం చేయమని కోరారు.
సమస్యలపై డైరెక్టర్ అజయ్ స్పందిస్తూ హెచ్ఆర్ఏ శాంక్షన్ చేయుటకు తగు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. రోడ్ల మరమ్మతుకు ఎస్టిమేట్ శాంక్షన్ ఇవ్వడానికి తగు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. కేటీపీఎస్ 7వ దశ నూతన క్వార్టర్స్ నిర్మాణంతో పాటు అకౌంట్స్ విభాగం వారికి కూడా నూతన బిల్డింగ్ నిర్మాణం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు దంచనాల రాంబాబు, జెన్కో అడిషనల్ కార్యదర్శి రాసూరి శ్రీనివాస్, జెన్కో ఉపాధ్యక్షుడు ధర్మపురి నాగేశ్వరరావు, అసిస్టెంట్ సెక్రటరీ అమీన్, కేటీపీఎస్ 7వ దశ రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ కాలువ రవికుమార్ యాదవ్, నారందాసు వెంకటేశ్వర్లు, రీజినల్ నాయకులు దుంపటి శ్రీను, అజీజ్ ఖాన్, ఎస్.సత్యం, సురేశ్, పప్పు విజయశంకర్ పాల్గొన్నారు.