రుద్రంపూర్, ఆగస్టు 21 : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ ప్రాంతంలోని గోధుమ వాగు బ్రిడ్జిపై ఏర్పడిన పార్ట్ హోల్ మరమ్మతు పనులను అధికారులు చేపడుతున్నారు. గురువారం ఉదయం నూతనంగా నిర్మించిన బ్రిడ్జిపై భారీ గుంత ఏర్పడడంతో పోలీసులు వెంటనే రాకపోకలను నిలిపివేసి వాహనదారులను అప్రమత్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో కాంక్రీట్ మిశ్రమాన్ని సరైన నిష్పత్తిలో కలపకపోవడం, అనంతరం భారీ వాహనాల రాకపోకల కారణంగా కాంక్రీట్లో లోపం ఏర్పడి రంధ్రం ఏర్పడి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నూతనంగా నిర్మించిన బ్రిడ్జిపై ఇలాంటి లోపం తలెత్తడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మరమ్మతు పనులను దగ్గరుండి పర్యవేక్షించి, నాణ్యతా ప్రమాణాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. భవిష్యత్లో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా బ్రిడ్జి నిర్మాణ నాణ్యతపై సమగ్రంగా పరిశీలన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.