కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 07 : భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై మతోన్మాద ముసుగులో ఉన్న న్యాయవాది జరిపిన దాడి ప్రజాస్వామ్య పునాదులపై జరిగిన దాడి అని, ఈ దాడిని భారతీయ సమాజం ముక్తకంఠంతో ఖండించాలని సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని నిరసిస్తూ సిపిఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం పోస్టాఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, న్యాయవ్యవస్థకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేశ న్యాయ వ్యవస్థకు ప్రతీక అని, ఆయనపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్య పునాదులపై దాడి చేయడమేనన్నారు.
ఇలాంటి సంఘటనలు న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తాయన్నారు. ప్రభుత్వం తక్షణం దాడి వెనుక ఉన్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం చెప్పే గొంతుకలను బెదిరించడం, దాడులకు పాల్పడటం సరైంది కాదన్నారు. న్యాయవాదులకు, న్యాయమూర్తులకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని, జరిగిన సంఘటనపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో గనిగళ్ల వీరాస్వామి, వాసిరెడ్డి మురళి, జిల్లా సమితి సభ్యులు కె.రత్నకుమారి, గొనె మణి, నాయకులు మర్రి గోపి, మాచర్ల శ్రీనివాస్, పిడుగు శ్రీనివాస్, షహీన్, పుట్టి భాగ్యలక్ష్మి, కైసర్, కత్తెర రాములు, కె.ధర్మరాజు, గొనె సురేశ్, గుత్తుల శ్రీనివాస్, బాదావత్ రంజీ, మండల రాజు పాల్గొన్నారు.