– వరుసగా రెండోసారి రూ.4 కోట్ల మార్కెట్ ఫీజు వసూలు
ఇల్లెందు, ఏప్రిల్ 04 : ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధిలో కొత్త మైలురాయిని నమోదు చేసింది. వ్యాపారస్తులు సకాలంలో మార్కెట్ ఫీజులు చెల్లించడం, అలాగే మార్కెట్ సిబ్బంది చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ల ఫలితంగా ఈ ఏడాది గణనీయమైన ఆదాయం సాధ్యమైంది. మార్కెట్ సిబ్బంది నేరుగా వ్యాపారస్తుల వద్దకు వెళ్లి నెలసరి నివేదికలు సేకరించడం, ఫీజు వసూళ్లను కట్టుదిట్టంగా అమలు చేయడం ద్వారా మార్కెట్ ఆదాయం పెరిగింది. ముఖ్యంగా సుమారు 1,50,000 క్వింటాళ్ల మొక్కజొన్నను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన దానికి మార్కెట్ ఫీజు లేదు. అయినప్పటికీ ఇల్లెందు మార్కెట్ వరుసగా రెండోసారి రూ.4 కోట్ల మార్కెట్ ఫీజును వసూలు చేసి రికార్డు సృష్టించింది.
మార్కెట్ స్థాపనకు 40 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ స్థాయి వసూళ్లు సాధించడం విశేషంగా నిలిచింది. దినదినాభివృద్ధి చెందుతున్న ఇల్లెందు మార్కెట్ కమిటీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.425.26 కోట్ల మార్కెట్ ఫీజు వసూలు చేసింది. ఇది మార్కెట్ అభివృద్ధికి, రైతులు, వ్యాపారుల మధ్య విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోంది. మార్కెట్ కమిటీ చేపడుతున్న చర్యలు, పారదర్శక విధానాలు భవిష్యత్లో మరింత ఆదాయ వృద్ధికి దోహద పడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.