ఇల్లెందు, జూలై 16 : రాయల చంద్రశేఖర్, ఎల్లన్న, యాదన్న తమ జీవితమంతా పీడిత ప్రజల పక్షాన నిలబడి సోషలిస్ట్ విప్లవం కోసమే జీవితం అంతా పోరాడారని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ కేంద్ర కార్యదర్శి ప్రదీప్‌సింగ్ ఠాగూర్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. బుధవారం ఇల్లెందు పట్టణంలో కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ మొదటి వర్ధంతి సభ సందర్భంగా ఇల్లెందు పట్టణం జేకే కాలనీలో ఏర్పాటు చేసిన స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు. ప్రభుత్వ వైద్యశాల, జగదాంబ సెంటర్, పాత బస్టాండ్ సెంటర్ మీదుగా చండ్ర కృష్ణమూర్తి ట్రస్ట్ భవనం వరకు ర్యాలీ తీశారు. ట్రస్ట్ భవనం కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాయల చంద్రశేఖర్, ఎల్లన్నస్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ విప్లవ జీవితంపై ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. చండ్ర కృష్ణమూర్తి ట్రస్ట్ భవన్ లో చంద్రశేఖర్ మీటింగ్ హాల్ నామకరణం చేసి ప్రారంభించారు.
అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ.. నేడు దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మైనార్టీలను శత్రువులుగా ఎంచుకుని వేటాడి చంపుతున్నారన్నారు. పౌర, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ, దాడులకు తెగపడుతూ భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారని, దేశంలో ఒక్క శాతం ఉన్న కార్పొరేట్ శక్తులకు దేశ సంపద సహజ వనరులను తాకట్టు పెడుతూ ప్రశ్నించిన వారిని అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేసి జైల్లో కుక్కుతున్నట్లు తెలిపారు.
సభకు సిపిఎంఎల్ మాస్‌లైన్ రాష్ట్ర నాయకురాలు చండ్ర అరుణ అధ్యక్షత వహించారు. సిపిఎంఎల్ మాస్‌లైన్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, రమక్క, కేజీ రామచందర్, చిన్న చంద్రన్న, చంద్రశేఖర్ జీవిత సహచరి విమల, కెచ్చల రంగారెడ్డి, ముద్ద భిక్షం, నాయిని రాజు, జగ్గన్న, అమర్ల పూడి రాము, అజ్మీర బిచ్చ, కొత్తపల్లి రవి, జాటోత్ కృష్ణ, బుర్ర వెంకన్న, యాకూబ్ శావళి, రేస్ బోసు, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి వాంకుడోత్ అజయ్ పాల్గొన్నారు.
Yellandu : పీడిత వర్గాలకు రాయల చంద్రశేఖర్ జీవితం అంకితం : ప్రదీప్‌సింగ్ ఠాగూర్
Yellandu : పీడిత వర్గాలకు రాయల చంద్రశేఖర్ జీవితం అంకితం : ప్రదీప్‌సింగ్ ఠాగూర్