బూర్గంపహాడ్, జూలై 14 : బూర్గంపహాడ్ మండలంలో రేషన్ లబ్దిదారులు సర్వర్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రేషన్ దుకాణాల్లో సర్వర్ పనిచేయక పోవడంతో బియ్యం పంపిణీలో జాప్యం జరుగుతోంది. నిరుపేదలు, కూలీ పనులకు వెళ్లే వారు రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రోజులో రెండు, మూడుసార్లు సర్వర్ పనిచేయక పోవడంతో ఖాళీ సంచులతో లబ్దిదారులు వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. రేషన్ షాపుల్లో సాంకేతిక సమస్యల కారణంగా రేషన్ బియ్యం కోసం వచ్చిన వృద్ధులు, మహిళలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
ప్రతినెలా 15వ తేదీ వరకే రేషన్ బియ్యం ఇవ్వాల్సి ఉండగా మండలంలోని కొన్ని దుకాణాల్లో ఈ సర్వర్ ప్రాబ్లం వల్ల రేషన్ బియ్యం అందకపోతే తమ పరిస్థితి ఏమిటని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పలు రేషన్ దుకాణాల్లో డీలర్లు సమయానుకూలంగా వ్యవహరించకపోవడం, సరిగ్గా దుకాణాలు తెరవకపోవడం వల్ల లబ్దిదారులు రేషన్ దుకాణాలకు వెళ్లి వెనుతిరుగుతున్న దాఖలాలూ లేకపోలేదు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా సర్వర్ సమస్యపై స్పందించి లబ్దిదారులకు రేషన్‌ను గడువు ముగిసినా ఇప్పించాల్సిన అవసరం ఉందని లబ్దిదారులు కోరుతున్నారు.