చండ్రుగొండ, ఫిబ్రవరి 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో నిర్లక్ష్యం బయటపడింది. ఇద్దరు విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశారు. ఈ నెల 11వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చండ్రుగొండలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో ఈ నెల 11వ తేదీ రాత్రి సమయంలో పదో తరగతి విద్యార్థినులు కాకటి స్వచ్ఛత, కాకటి గోపికలను ఎలుకలు కరిచాయి. కాళ్లపై ఎలుకలు కరిచిన విషయాన్ని వసతీగృహంలోని స్పెషల్ ఆఫీసర్ కవితకు తెలియజేశారు. దీంతో ఈ నెల 12వ తేదీన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యార్థినులకు చికిత్స అందించారు. విద్యార్థినులను ఎలుకలు కరిచిన విషయం బయటకు పోకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు.
కాగా విద్యార్థినులను ఎలుకల కరిచిన విషయం వారి తల్లిదండ్రులు, బంధువుల ద్వారా బయటకొచ్చింది. విషయం తెలియగానే ఎంఈవో సత్యనారాయణ గురువారం నాడు వసతీగృహాన్ని తనిఖీ చేశారు. ఎలుకలు కరిచిన విద్యార్థినులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ కవితను ఆదేశించారు. గదులలో రాట్మేట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, వసతీగృహంలో విద్యార్థినులను ఎలుకలు కరవడంపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.