రామవరం, ఆగస్టు 05 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి బంగ్లోస్ క్వార్టర్స్ లో అరుదైన సర్పం కనిపించింది. సోమవారం రాత్రి 11 గంటలకు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి పాము కనిపించగానే ప్రాణధార ట్రస్ట్ స్నేక్ రెస్క్యూ సభ్యుడు ముజఫర్‌కు సమాచారం అందించారు. వెంటనే అతడు వెళ్లి పామును పట్టుకున్నాడు. గతంలో ఎన్నడూ చూడని పాము కావడంతో ఫొటో తీసి ప్రాణదార ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోశ్‌కు తెలిపాడు. గమనించిన సంతోశ్ అది విషపూరితమైన కట్లపాము జాతికి చెందిన బాండెడ్ కైట్ స్నేక్ అని తెలిపారు.
హిమోటాక్సిన్ విషం కలిగినదని, ఈ సర్పం గుండ్రంగా కాకుండా మూడు పలకలుగా ఉండి సమాన వెడల్పు గల పసుపు, నలుపు చారలతో ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. ములుగు, ఏటూరునాగారం ప్రాంతాల్లో ఉంటుందని, రాత్రిళ్లు మాత్రమే సంచరిస్తుందని తెలిపారు. గతంలో ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ ఆవరణలోకి రెండు సార్లు వచ్చినట్లు పోలీస్ సిబ్బంది తెలిపారన్నారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ అరుదైన సర్పం కనిపించడం ఇదే తొలిసారి అని సంతోశ్ వెల్లడించారు.
Ramavaram : మణుగూరు సింగరేణి బంగ్లోస్ క్వార్టర్స్‌లో అరుదైన సర్పం పట్టివేత