కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 28 : ఎస్సీ వర్గీకరణ ప్రకారం రాజీవ్ యువ వికాసం యూనిట్లు మంజూరు చేయాలని మాదిగ జేఏసీ రాష్ట్ర సెక్రెటరీ జనరల్ మోదుగు జోగారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గ్రీవెన్స్ ప్రజావాణి కార్యక్రమం రద్దు కారణంగా ఇన్వార్డ్ ఇన్చార్జికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. జిల్లాలోని ఎస్సీలకు మంజూరైన 3,800 రాజీవ్ యువ వికాసం యూనిట్లలో ఎస్సీ వర్గీకరణ ప్రకారం గ్రూప్ 1కు- 1%, , గ్రూప్ 2కు -9% , గ్రూప్ 3కి -5% రిజర్వేషన్లలను మండలాల వారిగా అమలు చేయాలని, తద్వారా అందరికి న్యాయం జరుగుతుందని తెలిపారు.
పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసి యూనిట్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, కాలయాపన చేయకుండా రుణాలను మంజూరు చేయాలని కోరారు. అనేక మంది నిరుద్యోగులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా నిజమైన లబ్దిదారులను ఎంపిక చేసి ఆర్థికంగా ఎదిగేందుకు దోహదం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో మాదిగ జేఏసీ.జిల్లా ప్రధాన కార్యదర్శి దేపంగి వెంకటరమణ, రాజేశ్, కిరణ్ పాల్గొన్నారు.