జూలూరుపాడు, మార్చి 20 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అందరికీ వర్తింపజేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అన్నారు. పథకానికి సంబంధించి ప్రభుత్వం నిబంధనలు సడలించాలని కోరుతూ జూలూరుపాడు తాసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ పాండేకి గురువారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం నిబంధనలతో కూడుకొని ఉండటం వల్ల చాలామంది నిరుద్యోగులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను సడలించాలన్నారు. రేషన్ కార్డులు, బ్యాంకు సూరిటీలు, ఇంటర్వ్యూల విషయంలో సడలింపులు ఇవ్వాలన్నారు.
రేషన్ కార్డులు ఇవ్వలేని ప్రభుత్వాలు, ఉద్యోగాలు అడిగితే ఇవ్వలేని ప్రభుత్వాలు తమ పథకాన్ని ఉపయోగించుకోండి.. లోన్ తీసుకోండి.. షాపులు పెట్టుకోండి అని ఉద్యోగాల వైపు కాకుండా, ప్రశ్నించే తత్వం వైపు కాకుండా, వ్యాపారం వైపు బానిసలుగా చేస్తున్నారని ఇది సరైంది కాదన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ప్రకటించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అప్పుడు మాత్రమే ఈ రాజీవ్ వికాస పథకం వికసిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి వల్లోజి రమేశ్, గోపి, వేణు, నరసింహారావు పాల్గొన్నారు.