భద్రాచలం, అక్టోబర్ 17 : భద్రాచలంలో శుక్రవారం పలు బెల్టు షాపులపై భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ రైడ్లో అధిక సంఖ్యలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్, బస్టాండు ఎదురుగా, చర్ల రోడ్డులోని పలు దుకాణల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. పట్టణంలోని పలు పాఠశాలలు, కాలనీలోని ఇళ్ల మధ్యలో, జాతీయ రహదారి పక్కనే బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో నేరుగా ఏఎస్పీ పర్యవేక్షణలోనే రైడ్ చేశారు. పోలీసుల రైడ్ సమాచారాన్ని పలువురు బెల్టు దుకాణదారులు ముందుగానే తెలుసుకుని తమ దుకాణాలను మూసేసి పరారయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు శ్యాంకుమార్, సతీశ్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.