– కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్
జూలూరుపాడు, సెప్టెంబర్ 05 : రైతు స్థాయిలోనే విత్తనోత్పత్తి చేపట్టడం ద్వారా స్థానిక రైతులకు నాణ్యమైన, మేలైన విత్తనాలు అందుబాటులోకి వస్తాయని కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాబార్డ్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన వరి ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తి క్షేత్రాలను శనివారం ఆయన పరిశీలించారు. పీఏసీఎస్ చైర్మన్ కొమ్మినేని పాండురంగారావుతో కలిసి జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు, కొత్తూరు గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న విత్తన క్షేత్రాలను సందర్శించి పంట ఎదుగుదల, క్షేత్ర పరిస్థితులపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా డాక్టర్ భరత్ మాట్లాడుతూ.. విత్తనోత్పత్తిలో రైతులు పాటించాల్సిన మెళకువలను వివరించారు. కల్తీ లేని నాణ్యమైన ఫౌండేషన్ విత్తనాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా మండల రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో లంకా నరసింహారావు, సిబ్బంది సాయి నిరంజన్, వ్యవసాయ విస్తరణ అధికారులు విజయభాను, గోపికృష్ణలతో పాటు రైతులు పోలుదాసు విజయబాబు, మందా పుల్లయ్య, మందా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.