ఇల్లందు రూరల్ మార్చి 28 : మండల పరిధిలోని సీఎస్పీ బస్తీ రాజీవ్‌నగర్ కాలనీలో గల గుడిసె వాసులకు తాగునీటి వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం మిషన్ భగీరథ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు అబ్దుల్ నబీ, మండల నాయకులు ఆలేటి కిరణ్ లో మాట్లాడుతూ.. గుడిసె వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గత నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టినప్పటికీ అధికారులు, ఎమ్మెల్యే స్పందించకపోవడం దారుణమన్నారు. నిరసనగా మండల కార్యాలయం ముట్టడించి అనంతరం కొరగుట్టపై ఉన్న మిషన్ భగీరథ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టినట్లు తెలిపారు.
మండల నాయకుడు ఆలేటి కిరణ్ మాట్లాడుతూ.. గత ఆరు సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం పోరాట నిర్వహించి గుడిసెలు వేసుకున్నా నిరుపేదలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఫారెస్ట్, రెవెన్యూ, సింగరేణి అధికారులు దోబూచులాడుతున్నారన్నారు. ధర్నా నిర్వహిస్తున్న క్రమంలో ఎంపీడీఓ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గుడిసె వాసులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు తాలూరి కృష్ణ, మన్యం మోహన్ రావు, వజ్జా సురేశ్, వీరభద్రం, నాగమణి, భవాని, జ్యోతి, కమల, రసూల్ బి పాల్గొన్నారు.