కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 08 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆటో డ్రైవర్ల సంఘం (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం శేషగిరి భవన్లో జరిగిన పట్టణ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మోటార్ కార్మికులందరికీ సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తానని హామీ ఇచ్చిందన్నారు.
మహాలక్ష్మీ పథకం ఏర్పాటుతో నష్టపోయిన ఆటో కార్మికులకి ప్రభుత్వమే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించాలనీ, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన ఆటో డ్రైవర్లకి అవకాశం కల్పించాలనీ, 55 ఏండ్లు నిండిన మోటార్ ఆటో కార్మికులకు పింఛన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, మోటార్ ఆటో కార్మికులకి కార్పొరేట్ హాస్పిటల్స్లో రేషన్ కార్డుపై ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని, కార్పొరేట్ స్కూల్స్లో ఆటో మోటార్ కార్మికుల పిల్లలకి ఫీజులో రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మర్రి కృష్ణ , జిల్లా ఉపాధ్యక్షుడు ఆరేళ్లు కృష్ణ, పట్టణ కార్యదర్శి ఎస్కే పాషా, వివిధ ఆటో అడ్డా నాయకులు కిరణ్, మంద గాబ్రియల్, మంద శ్రీనివాస్, భద్రం, విజ్జి, రాంబాబు, సురేశ్ పాల్గొన్నారు.