కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 14 : ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1969 ఉద్యమకారులు చేపట్టిన తెలంగాణ ఉద్యమకారుల చైతన్య యాత్ర కొత్తగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా సమితి నాయకులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రెటరీ కేజిఎస్ మాథ్యూస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో వారికి స్వాగతం పలికి సన్మానం చేశారు.
తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మహ్లాడారు. మార్చి 23న చైతన్య యాత్ర ప్రారంభించామని, ఏప్రిల్ 21న సికింద్రాబాద్ లో ఉద్యమకారుల ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే జూన్ 2న అన్ని జిల్లాల కలెక్టరేట్ ముందు ఉద్యమకారులు ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పి.వీరస్వామి, డి.నాగయ్య, ఎండి గౌస్, పి.రామచందర్, కొమరయ్య. ఏ.రాజయ్య, దామర కొండ మల్లయ్య, సీహెచ్ కృష్ణార్జునరావు, బ్రహ్మం పాల్గొన్నారు.