బూర్గంపహాడ్, జూలై 27 : గుంతల రోడ్డు అధ్వాన్నంగా మారడంతో పాటు వర్షాల కారణంగా బురదమయంగా ఉన్న రోడ్డులో అంబులెన్స్ డ్రైవర్ సాహసంతో గ్రామానికి వెళ్లినప్పటికీ తిరిగి ఆమెను ఆస్పత్రికి చేర్చే క్రమంలో ఆ దారి నరకప్రాయంగా మారి అడవి మధ్యలోనే నిండు గర్భిణీ ప్రసవించిన ఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని చింతకుంట అటవీ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని మోతే పట్టీనగర్ పంచాయతీ చింతకుంటకు చెందిన సోడి మార్త నిండు గర్భిణీ. పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అంబులెన్స్ పైలెట్ విజయభాస్కర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ రాధ గ్రామానికి బయల్దేరారు. గ్రామానికి ఒకే రోడ్డు ఉండడం, అది గుంతలమయంగా ఉండటంతో పైలెట్ విజయభాస్కర్ సాహసంతో వాహనం నడిపి గ్రామంలో నిండు గర్భిణీ మార్తను ఎక్కించుకుని తిరిగి ఆస్పత్రికి బయల్దేరారు.
అయితే రోడ్డంతా గుంతలతో ఉండటంతో కుదుపులకు గురై నొప్పులు మరింత తీవ్రతరం కావడంతో పాటు ప్రసవం అయ్యే సూచనలు కనిపించడంతో సిబ్బంది అటవీప్రాంతం మధ్యలోనే అంబులెన్స్‌ను నిలిపివేశారు. ఈఎంటీ రాధ అధైర్య పడకుండా అంబులెన్స్‌లో అవసరమైన వైద్య అందించి మార్తకు ప్రసవం చేయగా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం వారిని సురక్షితంగా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చింతకుంట గ్రామస్థులు, ఆదివాసీలు పాలకుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు హామీలు గుప్పించి తీరా ఎన్నికల్లో గెలిచాక గ్రామం ముఖం కూడా చూడకపోవడంతో మండిపడుతున్నారు. తక్షణమే రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసి గ్రామంలో మౌలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.