కారేపల్లి, అక్టోబర్ 01 : సింగరేణి మండలంలోని ఉసిరికాయపల్లి గ్రామ పంచాయతీ గొల్లగూడెం-2 అంగన్వాడీ కేంద్రంలో గురువారం 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ కామేపల్లి ప్రాజెక్టు సిడిపీఓ కె.ఉమా ముఖ్య అతిథిగా పాల్గొని తల్లులకు పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరించారు. చిన్నారుల ఎదుగుదల, ఆరోగ్యకరమైన జీవనానికి పోషక విలువలతో కూడిన సమతుల ఆహారం ఎంతో అవసరమని తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని సూచించారు.
అనంతరం అంగన్వాడీ కేంద్రంలో వివిధ రకాల పోషకాహార పదార్థాలతో ఫుడ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు తదితర ఆహార పదార్థాల ద్వారా సమతుల పోషకాహారం పొందే విధానాన్ని తల్లులకు వివరించారు. చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పోషకాహార సేవలను సద్వినియోగం చేసుకోవాలని సిడిపీఓ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ వరలక్ష్మి, ఉప సర్పంచ్, సూపర్ వైజర్ సత్యశీల, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.

తల్లులకు పౌష్టికాహార ప్రాముఖ్యతపై అవగాహన