చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ను, డీఎంపీ ఎంపీ కనిమొళి తీవ్రంగా విమర్శించారు. కొత్త సచివాలయం ప్రతిపాదనపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. విజయ్ను అమెరికా అధ్యక్షుడిని చేసే ప్రణాళికలు కూడా ఆ జ్యోతిష్యుడికి ఉన్నాయేమోనని ఆమె అన్నారు. (Kanimozhi mocks Vijay) డీఎంకే కార్యక్రమంలో ప్రసంగించిన కనిమొళి, 1,200 ఎకరాల్లో నిర్మించాలని సీఎం విజయ్ ప్రతిపాదించిన కొత్త సచివాలయ సముదాయం ప్రణాళికల గురించి ప్రస్తావించారు. ‘జ్యోతిష్యుడు ఆయనకు ఏం చెప్పాడో నాకు తెలియదు. కానీ వారు కొత్త అసెంబ్లీని నిర్మించబోతున్నారు. సముద్రాన్ని చూడటం వల్లే విజయ్ ఇప్పటికే ముఖ్యమంత్రి అయ్యారని, మళ్లీ సముద్రాన్ని చూడటం వల్ల ప్రధానమంత్రి కూడా కాగలరని ఆ జ్యోతిష్యుడు విజయ్‌కు చెప్పి ఉండవచ్చు’ అని ఆమె అన్నారు. అలాగే విజయ్ను అమెరికా అధ్యక్షుడిగాను చేయడానికి నేరుగా అక్కడకు పంపే ముందు, ఢిల్లీలోని తాజ్ మహల్ లేదా హిమాలయాలను చూడమని ఆ జ్యోతిష్యుడు ఆయనకు సలహా ఇవ్వవచ్చని కనిమొళి వ్యాఖ్యానించారు.
కాగా, కొత్త సచివాలయానికి సంబంధించి సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. సుమారు రూ.1,200 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్‌ను చెన్నైలోని సముద్ర తీరప్రాంతమైన పట్టినపాక్కంలోని తమిళనాడు హౌసింగ్ బోర్డు స్థలంలో నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. అయితే 1,500కు పైగా మత్స్యకార కుటుంబాలు ఈ స్థలాన్ని వినియోగిస్తుండటంతో వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
మరోవైపు మే 10న సీఎంగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన రెండు రోజులకే తన జ్యోతిష్యుడైన పండిట్ వెట్రివెల్ను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా నియమించారు. అయితే డీఎంకే, వీసీకే, వామపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. దీనిపై వివాదం ముదరడంతో ఆ నియామకాన్ని రద్దు చేశారు. తాజాగా కొత్త సచివాలయానికి సంబంధించిన సీఎం విజయ్ ప్రణాళికను డీఎంకే ఎంపీ కనిమొళి ఆ జ్యోతిష్కుడితో ముడిపెడుతూ ఈ మేరకు వ్యంగ్యంగా విమర్శించారు.