టెల్ అవివ్: ఇజ్రాయిలీ దేశస్థులతో వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం(Flydubai Flight)లో.. పైలట్‌పై కోపైలట్ అటాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే కాక్‌పిట్‌లోకి ఎలా వెపన్‌ను తీసుకెళ్లారన్న ప్రశ్న ఉత్పన్నం అయ్యింది. ఒమన్‌కు చెందిన కోపైలట్ కత్తి వాడినట్లు తొలుత భావించారు. కానీ ఇండియన్ పైలట్ స్మిత్ మచ్చర్‌ను గొడ్డలితో నరికినట్లు అనుమానిస్తున్నారు. కాక్‌పిట్‌లోకి వెళ్లే సమయంలో కోపైలట్ వద్ద కత్తి కానీ, మరో ఆయుధం కానీ లేదని, కానీ అతను ఆ కాక్‌పిట్‌లో ఉన్న క్రాష్ యాక్స్ లేదా ఫైర్ యాక్స్ వాడినట్లు భావిస్తున్నారు. దాడి కోసం గొడ్డలి వాడి ఉంటాడని ప్రధాని బెంజిమన్ నెతన్యహూ కూడా తొలుత అనుమానాలు వ్యక్తం చేశారు.
దుబాయ్ నుంచి విమానం బయలుదేరిన రెండున్నర గంటల తర్వాత అకస్మాత్తుగా 33వేల ఫీట్ల ఎత్తు నుంచి 17 వేల ఫీట్లకు గాలిలోనే విమానం దిగజారింది. జోర్డాన్ బోర్డర్ సమీపంలో ఆ విమానం ఒక్కసారిగా వెనక్కి తరిగింది. సౌదీ సిటీ తబుక్‌లో ఆ విమానం ల్యాండ్ అయినట్లు ఫ్లైట్‌రేడార్24 పేర్కొన్నది. ఒకవైపు ప్రయాణికులు అరుస్తుండగా, రక్తంతో తడిసిన పైలట్ మేడే అంటూ ఏటీసీతో పేర్కొన్నాడు. విమానాన్ని హైజాక్ చేస్తున్నట్లు అతను ఏటీసీకి చెప్పాడు. అయితే అంతర్జాతీయ విమాన నిబంధనల ప్రకారం ప్రతి కమర్షియల్ విమానంలో ఓ చిన్నపాటి గొడ్డలి ఉంటుంది. ఒకవేళ ఎమర్జెన్సీలో అవసరం వస్తే, ఆ గొడ్డలిని వాడే రీతిలో దాన్ని విమానాల్లో తీసుకెళ్తుంటారు. సెప్టెంబర్ లెవన్ దాడులకు ముందు ప్రధాన క్యాబిన్లలో గొడ్డలిని స్టోర్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ గొడ్డళ్లను కాక్‌పిట్‌కు తరలించారు.
దాడికి పాల్పడిన కోపైలట్ వివరాలను ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. గొడ్డలితో దాడి చేసిన కోపైలట్ది ఒమన్ అని గుర్తించారు. అతన్ని అరెస్టు చేసినట్లు నెతన్యహూ తెలిపారు. విమానం హైజాక్ ఘటన పట్ల దర్యాప్తు చేపడుతున్నట్లు సౌదీ, యూఏఈ అధికారులు వెల్లడించారు. దర్యాప్తు నేపథ్యంలో ఇజ్రాయెల్ వెళ్లే విమానాలను రద్దు చేసినట్లు ఫ్లైదుబాయ్ పేర్కొన్నది. సెప్టెంబర్ లెవన్ లాంటి దాడి జరగకుండా పైటల్ మచ్చర్ అడ్డుకున్నాడని నెతన్యహూ తెలిపారు.