– ఎఫ్ఏక్యూ పేరుతో పీఆర్ రైతులకు తరుగు భారం!
– మిల్లర్లు, అధికారుల కుమ్మక్కుతో నిలువుదోపిడీ జరుగుతోందని రైతుల ఆవేదన
చుంచుపల్లి, మే 16 : చుంచుపల్లి మండలంలో పీఆర్ రకానికి చెందిన వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అధికారికంగా ప్రభుత్వం పీఆర్ రకాల ధాన్యానికి తరుగు తీసుకోవాలనే నిబంధన ఎక్కడా లేకపోయినా, మిల్లర్లు – అధికారులు కుమ్మక్కై “ఎఫ్ఏక్యూ” నిబంధన పేరుతో రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మండలంలోని రాంపురం, చుంచుపల్లి తండా ప్రాంతాల్లో సుమారు 450 ఎకరాల్లో పీఆర్ రకానికి చెందిన వరి సాగు చేశారు. ఈ సాగులో దాదాపు 12,500 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చినట్లు రైతులు తెలిపారు. ప్రస్తుతం ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద, కల్లాల్లో పోసి ఉండగా కొనుగోలు ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు.
ప్రభుత్వం సన్న రకాల ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించినప్పటికీ పీఆర్ రకాలకు ఎలాంటి బోనస్ ఇవ్వడం లేదని రైతులు అంటున్నారు. అయితే పీఆర్ రకాలు వేయవద్దని ప్రభుత్వం ముందుగానే ఎప్పుడూ సూచించలేదని రైతులు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు మాత్రం మిల్లర్లు “పీఆర్ ధాన్యం తీసుకోం” అంటూ ప్రచారం చేస్తూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక పీఆర్ ధాన్యం కొనుగోలు చేసినా క్వింటాకు 10 కిలోల వరకు తరుగు తీస్తామని ముందుగానే చెప్పి, పీఏసీఎస్ ద్వారా కొనుగోలు చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారం అధికారులకు తెలిసినా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ అధికారులు “ఎఫ్ఏక్యూ ప్రమాణాలు నిర్ధారిస్తేనే కొనుగోలు చేస్తాం” అంటూ రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని, చివరకు కొనుగోళ్ల సమయంలో 10 కిలోల వరకు తరుగు విధిస్తూ కాటా పెట్టిస్తున్నారని రైతులు చెబుతున్నారు. పరిస్థితి దయనీయంగా ఉండటంతో రైతులు కూడా చేసేదేమీ లేక నష్టపోయినా కాటాకు అంగీకరిస్తున్న పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అధికారులు వచ్చి మాట్లాడినా పీఏసీఎస్, ఐకేపీ నిర్వాహకులు మాత్రం ససేమిరా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఒకవైపు కల్లాల్లో ధాన్యం పేరుకుపోతుండగా, మరోవైపు వర్షాలు వస్తే ధాన్యం తడిసి మరింత నష్టం వస్తుందనే భయంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇటు ప్రభుత్వ అధికారులు, అటు మిల్లర్లు కలిసి రైతులను దోచుకుంటున్నారనే అభిప్రాయం గ్రామాల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని పీఆర్ ధాన్యానికి ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని, అక్రమ తరుగు విధానాన్ని అరికట్టి రైతులకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.