జూలూరుపాడు, జూలై 23 : అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, నేరాల నివారణతో పాటు రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా జూలూరుపాడు పోలీసులు గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. మండల కేంద్రంలోని చండ్రుగొండ క్రాస్ రోడ్డు వద్ద ప్రధాన రహదారిపై పోలీసు అధికారులు వాహనాలను నిలిపి ముమ్మరంగా ‘నాకాబందీ’ నిర్వహించారు. జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, సబ్ ఇన్స్పెక్టర్ జీనత్ కుమార్, అదనపు ఎస్ఐ మనీషా, పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మార్గంలో రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలను పోలీసులు నిలిపి క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు, ఎలాంటి అనుమతులు లేకుండా తిరుగుతున్న వాహనదారులను గుర్తించి వారికి జరిమానాలు విధించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ నాకాబందీ కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.