చర్ల, మే 20 : మావోయిస్టు ప్రభావిత గ్రామాల ఆదివాసీలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఆదివాసి గ్రామం చెన్నాపురంలో మంగళవారం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందినవారు వస్తే గ్రామస్తులు సహకరించవద్దన్నారు. కొత్త వ్యక్తులు గ్రామంలోకి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చెన్నాపురంలోని ఇంటింటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం గ్రామంలోని 90 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, దుస్తులు అందజేశారు. యువకులకు వాలీబాల్ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజువర్మ, ఎస్ఐలు నర్సిరెడ్డి, కేశవ్, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.