కొత్తగూడెం గణేష్ టెంపుల్, జూలై 09 : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధి గంగా హుస్సేన్ బస్తీలో చర్చి పునర్నిర్మాణానికి స్థానికులు సహకరించాలని ప్రార్థనా మందిరం నిర్వాహకులు కోరారు. గురువారం చర్చి పునర్నిర్మాణ స్థలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గంగబీషన్ బస్తీలో 2011 సంవత్సరం నుండే చర్చి ఉందని, ఈ చర్చికి జిల్లా నలుమూలల నుండి అనేకమంది పాస్టర్లు, క్రిస్టియన్లు, నమ్మకస్తులు వచ్చి ప్రార్థనలు చేసుకునే వారని తెలిపారు. ఎప్పుడూ కూడా ఎవరికీ ఆటంకం కలగకుండా ప్రార్థనలు జరిగాయన్నారు. కాలక్రమేనా చర్చి శిథిలావస్థలోకి చేరడంతో 2025లో తొలగించడం జరిగిందని, అదే స్థలంలో కొత్తగా నిర్మాణం చేపట్టాలని పనులు మొదలుపెట్టిన క్రమంలో చర్చి పక్కన ఇంట్లోని వారు, మరికొంత మంది వ్యక్తులు కావాలనే పనులను అడ్డుకుంటూ, ప్రభుత్వ అధికారులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి పనులను అడ్డుకుంటున్నట్లు తెలిపారు.
ఈ విషయాలపై పోలీస్ స్టేషన్‌పై కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. చర్చికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు ఉన్నాయని, క్రమబద్దీకరణ పట్టా కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, ఎన్నికల కారణంగా పట్టా ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. లీగల్ గా అన్ని అర్హతలు, ధ్రువపత్రాలు కలిగి ఉన్న ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. గత ఏడాదిగా ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు చేసుకునే వందలాది మంది అవస్థలు పడుతున్నారని, నిర్మాణ పనులు అడ్డుకునే వారిపై పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రార్థనా మందిరం నిర్వాహకులు కిన్నెర లక్ష్మణ్, మణి, లక్ష్మి, సుశీల, అరుణ్ పాస్టర్, రాజు, స్థానికులు పాల్గొన్నారు.