– సింగరేణి సీఎంఓ కిరణ్ రాజ్‌కుమార్ చేతుల మీదుగా ఉద్యోగ నియామకం
కరకగూడెం, మే 23 : పట్టు వదలక ప్రయత్నిస్తే ప్రభుత్వ కొలువు సాధించడం పెద్ద కష్టతరమేమీ కాదని నిరూపించాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన కరకగూడెం మండలం మారుమూల గ్రామం గొల్లగూడెంకు చెందిన ఆదివాసీ బిడ్డ పాయం రామకృష్ణ. కరకగూడెం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన పాయం కన్నయ్య- లక్ష్మీ దంపతుల రెండో కుమారుడు పాయం రామకృష్ణ. చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ 2004లో భద్రాచలం కొత్తూరు నారాయణపురం ఆశ్రమ పాఠశాలలో పదో పరీక్ష ఫలితాల్లో 513 మార్కులు సాధించి డివిజన్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు. ఆ తర్వాత ఇంటర్మిడియట్, డిగ్రీ, పీజీ ( కెమిస్ట్రీ) పూర్తి చేశాడు. కొంతకాలం గురుకులంలో ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహించాడు. కరోనా ప్రభావంతో గ్రామానికి వచ్చి కొంతకాలం గ్రామీణ వైద్యుడిగా ప్రజలకు సేవలందిస్తూ కుటుంబానికి అండగా నిలబడ్డాడు.
ఆ తర్వాత 2017లో సింగరేణి విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సన్నద్ధమయ్యి పరీక్ష రాశాడు. అయితే సింగరేణిలో భూమిని కోల్పోయిన కుటుంబాలు కోర్టులో కేసు వేయడంతో ఆ ఫలితాలు నిలిచిపోయాయి. సరిగ్గా 5 ఏండ్ల తర్వాత వివాదాలు ముగియడంతో 2022లో సింగరేణి ఫలితాలు విడుదల చేసింది. ఈ ఫలితాల్లో రామకృష్ణ సింగరేణి సంస్థలో అండర్ గ్రౌండ్ ట్రామారు గా ఉద్యోగం సాధించాడు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణిలో ట్రామర్ విధులు నిర్వహిస్తూనే 2024 శానిటరీ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ రాగా ఉద్యోగం చేస్తూనే మరోవైపు పరీక్షకు సన్నద్ధమయ్యాడు. ఈ క్రమంలో 2025 నవంబర్ లో నిర్వహించిన పరీక్షలో శానిటరీ ఇన్స్పెక్టర్ కొలువు సాధించి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. నేడు సింగరేణి సీఎంఓ ఆర్.కిరణ్ రాజ్‌కుమార్ చేతుల మీదుగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాడు.