ఇల్లెందు, సెప్టెంబర్ 13 : వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా ఉండాలని ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఇల్లెందు మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవలి కాలంలో కన్న తల్లిదండ్రులను పిల్లలు భారంగా భావిస్తున్నారన్నారు. పిల్లలు తల్లిదండ్రుల ఆస్తులు పంచుకుంటున్నారు గానీ, వారి పోషణను, సంరక్షణను పట్టించుకోవడం లేదన్నారు. ఇది చాలా బాధకారమైన విషయం అన్నారు. కావున కొడుకులైనా, కూతుర్లైనా వారిని వృద్ధాప్యంలో ఇబ్బంది పెట్టకుండా సంరక్షించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు.
లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం కక్షిదారులు క్షణికావేశంలో పెట్టుకున్న పోలీస్ కేసులు రాజీపడదగిన, మనోవర్తి, గృహింస, చెక్ బౌన్స్, ప్రామిసరీ నోటు కేసులు ఇట్టి కేసుల్లో ఇరువర్గాలు కోర్టుకు వచ్చి రాజీ కుదుర్చుకున్నట్లైతే ఇరు వర్గాలు గెలిచినట్లే అవుతుందన్నారు. తద్వారా ఎంతో విలువైన కాలాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చు అన్నారు.
అనంతరం ఇల్లెందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జి చేతుల మీదుగా కక్షిదారులకు పులిహోర పొట్లాలను, మొక్కలు పంపిణీ చేసి విధిగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తీక్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ టి.ఇందిర, సీనియర్ న్యాయవాదులు ఎస్.వెంకట నరసయ్య, కొండ నారాయణ, ఎస్.వెంకటేశ్వర్లు, డీఎస్పీ చంద్రబాను, సీఐ.సురేశ్, పోలీసు సిబ్బంది, కోర్టు సిబ్బంది, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పొద్దుటూరి నాగేశ్వరరావు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.