కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 02 : ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌పై చేసిన దాడిని బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుందని, పెహల్గాం దాడిలో పాల్గొన్న వాళ్లలో ఎంత మంది పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపారో కేంద్ర ప్రభుత్వం చెప్పలేకపోతుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం సీపీఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ పై విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం వద్ద సరైన సమాధానం లేదన్నారు. ప్రధాని మోదీ తన అనుకూల మీడియాతో ప్రపంచానికి అబద్ధాలు వల్లెవేశారని కానీ అంతర్జాతీయ ఛానెళ్లు భారత ప్రభుత్వ మీడియాను అవహేళన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ హిందూ – ముస్లింలను రెచ్చగొడుతూ వక్ర బుద్ధిని చూపిస్తున్నాయని దుయ్యబట్టారు. భారత్ – పాక్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రచారం చేసుకుంటుంటే అది నిజామా? అబద్దమా? అని విపక్ష సభ్యులు అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. ఇది మోదీ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
ట్రంప్ మోదీకి మిత్రుడైనప్పటికీ 25 శాతం టారిఫ్ వేయడంలో వెనుకంజ వేయడం లేదన్నారు. ప్రస్తుతం బ్రిటన్‌తో జీరో టారిఫ్ తో మోదీ ఒప్పందం చేసుకున్నారని, ఇది భవిష్యత్‌లో వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, వస్తువులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్‌లో ఓటర్ల తొలగింపు పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, ఈసీ, బీజేపీ వ్యవహరిస్తున్న తీరును సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్ ఓట్లను తగ్గించడమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తుందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనన్నారు. స్థానిక ఎన్నికలలో ప్రస్తుతం ఒంటరిగా వెళ్లే ఆలోచనలో ఉన్నామని, అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుత ప్లాన్‌తో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ తో భద్రాచలం కు తీవ్ర ముప్పు పొంచిఉందని, భద్రాద్రి దేవాలయం కాపాడే బాధ్యత తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారని నిజమైన అర్హులకే ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై బీజేపీ దృష్టి సారించి అమలు పరిచే విధంగా కేంద్రంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఒత్తిడి తేవాలన్నారు.
సీతారామ ప్రాజెక్ట్ కు జిల్లాలోని ముగ్గురు మంత్రులు ఇప్పటికీ నాలుగు సార్లు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని ఎద్దేవా చేశారు. పాత డిజైన్ ప్రకారమే ప్రాజెక్ట్ నిర్మించి ఈ ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా రైతులతో కలిసి అవసరమైతే ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండారి రవి కుమార్, జిల్లా కార్యదర్శి మెచ్చ వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు యలమంచిలి రవికుమార్, అన్నవరపు కనకయ్య, అన్నవరపు సత్యనారాయణ, ఏ జే రమేశ్, ఎం.జ్యోతి, కారం పుల్లయ్య, ఎం బీ.నర్సారెడ్డి, లక్కి బాలరాజు పాల్గొన్నారు.