కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 11 : ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న హత్యాకాండపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని “అఖిల భారత రైతు కూలీ సంఘం”(AIKMS), సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం సబ్ డివిజన్ కమిటీ నాయకుడు భూక్య కిషన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని రామవరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్యభారతంలో ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వం హత్యాకాండను జరుపుతూ, నిత్యం నరమేధం సృష్టిస్తూ, రక్తాన్ని ఏరులై పారుస్తున్నట్లు తెలిపారు. అడవుల్లో ఉన్నటువంటి సహజ అటవీ, ఖనిజ సంపదను బీజేపీ ప్రభుత్వం బడా కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసం ప్రతిఘటిస్తున్న ఆదివాసులను హతమారుస్తున్నారని ఆరోపించారు.
నాడు బ్రిటిష్ సామ్రాజ్య వాదులు అటవీ సహజ సంపదను, బంగారం, వజ్రాలు వగైరా సంపదను కొల్లగొట్టుకుని పోతే ఈనాటి ఈ బీజేపీ ప్రభుత్వం వారి అభిమానులైన అంబానీ, అదానీ, బడా కార్పొరేట్లకు సంపదను దోచిపెడుతున్నదని విమర్శించారు. ఎదురుతిరిగిన అమాయక ఆదివాసి గిరిజనులను నిత్యం ఎన్కౌంటర్ల పేరుతో చంపేస్తూ, వారిని నక్సలైట్లుగా ముద్రవేస్తూ, ప్రశ్నించిన వారిని కూడా జైలుకు పంపుతూ, బేస్ క్యాంపుల్లో బందీలుగా నిర్బంధిస్తూ ఆదివాసి జాతి హననానికి పాల్పడుతున్నట్లు తెలిపారు.
మణిపూర్, అసోం, పంజాబ్, కాశ్మీర్ తదితర రాష్ట్రాల్లో మత ఘర్షణలు రెచ్చగొట్టి అంతులేని హింసాకాండ కొనసాగిస్తున్నట్లు ధ్వజమెత్తారు. పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల రైతులపై నిర్బంధాన్ని మోపి రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చారని, కార్మికుల ఐక్యతను చీల్చి వారి శ్రమను దోచుకునేందుకు 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ లు తీసుకువచ్చారని ఆరోపించారు. అడవులపై పూర్తి హక్కులు ఆదివాసులకు దక్కాలని, సహజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడాన్ని వెనక్కి తీసుకోవాలని, ఆదివాసీలపై జరుపుతున్న హత్యాకాండపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని, పెసా చట్టం 2006ను అమలు చేయాలని, ఆదివాసీల భూమి హక్కును ,జీవించే హక్కును, కాపాడాలని పేర్కొన్నారు. అనంతరం ఈ నెల 25న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగే సదస్సును జయప్రదం చేయాలని వాల్ పోస్టర్ ను ఆవిష్కరించి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈర్ల ఆనంద్, అనిత, రాజేశ్, పాపమ్మ, రంగమ్మ, సుజాత, హరిత, రాజమ్మ పాల్గొన్నారు.