– సారపాక జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్ధిని రత్నదీపిక
బూర్గంపహాడ్, ఆగస్టు 22 : దృఢమైన సంకల్పంతో లక్ష్యాన్ని సాధించాలని బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్ధిని కింతాడి రత్నదీపిక అన్నారు. గర్ల్ చైల్డ్ ఎంపర్మెంట్ కార్యక్రమంలో భాగంగా శనివారం పాఠశాలలో హెచ్ఎం దూద అధ్యక్షతన బాలికల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రత్నదీపిక హాజరై మాట్లాడుతూ.. జీవితంలో ఒక గోల్ పెట్టుకుని దానిని సాధించాలంటే ఎలాంటి ఆటంకాలు వచ్చినా దృఢసంకల్పంతో ఎదుర్కొని అధిగమించాలని ఉద్భోధించారు. క్రమశిక్షణ, పట్టుదల ఇందుకు చాలా అవసరమన్నారు.
తాను మొదటి నుండి ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో చదువు పూర్తిచేసి నేడు గ్రాన్యూల్ ఇండియా లిమిటెడ్‌లో సీనియర్ టెక్నికల్ అసోసియేట్‌గా ఉద్యోగం చేస్తున్నానని తెలిపారు. చదువు ద్వారా మహిళల సాధికారత సాధ్యమవుతుందన్నారు. కడు పేదరికం నుండి కష్టపడి ఉన్నతస్థాయికి చేరానని విద్యార్థుల్లో స్పూర్తి, ఉత్తేజాన్ని నింపారు. అనంతరం రత్నదీపికను పాఠశాల యాజమాన్యం శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీదేవి, కృష్ణవేణి, హేమ, స్వరూప, శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు.