– ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ వెల్లడి
రుద్రంపూర్, జూలై 23 : సింగరేణి సంస్థ పరిధిలోని సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీలో పని చేస్తున్న ఉద్యోగులకు కూడా కార్పొరేట్ శాలరీ అకౌంట్ ద్వారా అందించే రూ.1 కోటి ప్రమాద బీమా (యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్) వర్తించేలా సంబంధిత బ్యాంకులు అంగీకరించినట్లు ఏఐటీయూసీ సింగరేణి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్పొరేట్ శాలరీ అకౌంట్ కలిగిన ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణించిన పక్షంలో సంబంధిత నిబంధనల ప్రకారం అతడి కుటుంబానికి రూ.1 కోటి ప్రమాద బీమా ప్రయోజనం అందే విధంగా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం సింగరేణి స్కూల్ ఎడ్యూకేషనల్ సొసైటీలో ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు వారి కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు.
అదేవిధంగా సింగరేణి సూపర్ బజార్లో పని చేస్తున్న ఉద్యోగులకు కూడా ఇదే తరహా రూ.1 కోటి ప్రమాద బీమా సౌకర్యం వర్తించేలా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యాజమాన్యం సంబంధిత బ్యాంకులతో చర్చలు జరుపుతూ నిరంతరం కృషి చేస్తోందని వెల్లడించారు. సింగరేణి సంస్థ పరిధిలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగికి సమాన సంక్షేమ సౌకర్యాలు, భద్రతా పరిరక్షణ అలాగే ఆర్థిక రక్షణ కల్పించడమే ఏఐటీయూసీ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. ఉద్యోగుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.