– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం. జనవరి 06 : మున్సిపాలిటీ ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీలు, లిఖిత పూర్వకంగా నిర్ణీత గడువులోగా సమర్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. మంగళవారం ఐ డి ఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 01-10-2025 నాటికి ఓటరుగా నమోదు అయిన ప్రతి వ్యక్తిని ఎపిక్ కార్డులో పేర్కొన్న చిరునామా ఆధారంగా ఆయా డివిజన్లకు సంబంధించిన ఓటరు జాబితాలో చేర్చడం జరిగిందని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి ఈ నెల 9వ తేదీ వరకు స్వీకరించే అభ్యంతరాలను పూర్తిగా పరిశీలించి, పరిష్కరించిన అనంతరం 10వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
జిల్లాలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు అశ్వరావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల పరిధిలోని మొత్తం 106 వార్డులకు గాను 1,85,750 మంది ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటరు జాబితాను సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఈ జాబితాలో పేరు, చిరునామా, వార్డు, ఇతర వివరాల్లో ఏవైనా పొరపాట్లు లేదా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు వేర్వేరు వార్డుల్లో ఓట్లు నమోదై ఉండడంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు వార్డుల్లో నమోదు అయి ఉంటే, సంబంధిత దరఖాస్తుల ఆధారంగా వాటిని సరిచేసే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ సుజాత, ఇల్లెందు మున్సిపల్ కమిషనర్ చింత శ్రీకాంత్, అశ్వరావుపేట మున్సిపల్ కమిషనర్ నాగరాజు, సిపిఎం తులసీరామ్, బిజెపి నోముల రమేశ్, సిపిఐ శ్రీనివాస్, జే ఎస్ పి సందీప్, ఐ ఎన్ సి లక్ష్మణ్ అగర్వాల్, టిడిపి కళ్యాణ లక్ష్మీపతి, బీఎస్పీ శంకరయ్య, ఏ ఏ పి రమేశ్, ఎన్నికల విభాగ అధికారులు పాల్గొన్నారు.