– వాహనదారులకు తప్పని తిప్పలు
– రామవరం–ఎస్సీబీ నగర్, బేతానియా ఎదురుగా ఉన్న ట్రాక్‌కు దారి తెలియక ఇబ్బందులు
చుంచుపల్లి, జూలై 04 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రవాణా శాఖకు చెందిన డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామవరం–ఎస్సీబీ నగర్ ప్రాంతంలో బేతానియా ఎదురుగా ఉన్న ఈ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌కు ప్రతిరోజూ సుమారు 50 నుంచి 100 వాహనాలు డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు (ఎఫ్‌సీలు), కొత్త వాహనాల తనిఖీలు, ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, లారీలు వస్తుంటాయి. అయితే ట్రాక్‌కు వెళ్లే దారిని సూచించే బోర్డు పిచ్చిమొక్కలతో పూర్తిగా కప్పుకుపోయి కనిపించకుండా పోవడంతో, ముఖ్యంగా మొదటిసారిగా వచ్చే వాహనదారులు ట్రాక్ ఎక్కడ ఉందో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బేతానియా ఎదురుగా ఉన్న రహదారి నుంచి ట్రాక్‌కు వెళ్లాల్సి ఉన్నప్పటికీ, స్పష్టమైన సూచిక బోర్డు కనిపించకపోవడంతో పలువురిని అడుగుతూ దారి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాహనదారులు చెబుతున్నారు.
ఇటీవల కురుస్తున్న వర్షాలతో ట్రాక్‌కు వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. దీంతో డ్రైవింగ్ పరీక్షలకు వచ్చే అభ్యర్థులు, కొత్త వాహనాల యజమానులు, ఫిట్నెస్ కోసం వచ్చే వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వర్షపు నీరు నిల్వ ఉండడంతో వాహనాలు నడపడం ప్రమాదకరంగా మారిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్ వద్ద ప్రస్తుతం ఒకే ఒక్క షెడ్డు మాత్రమే ఉండటంతో అధికారులు, సిబ్బంది, వాహనదారులు ఎండా, వానకు ఇబ్బందులు పడుతున్నారు. ఫిట్నెస్ తనిఖీలు, స్టిక్కరింగ్, ఇతర సేవల కోసం వచ్చే వాహనదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనపు షెడ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ట్రాక్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించినప్పటికీ, ప్రస్తుతం నిర్వహణపై తగిన శ్రద్ధ కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదాయ లక్ష్యాల సాధనపై దృష్టి సారిస్తున్న అధికారులు, ట్రాక్ నిర్వహణ, రహదారి మరమ్మతులు, సూచిక బోర్డుల ఏర్పాటు, కనీస మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి పెట్టాలని వాహనదారులు కోరుతున్నారు. అధికారులను వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.

టార్గెట్లపై ఉన్న శ్రద్ధ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌పై ఏది?