– ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
– ఈ నెలాఖరు వరకే దరఖాస్తు గడువు
– నవంబర్ 28న ప్రవేశ పరీక్ష
కరకగూడెం, జులై 15 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజేన్సీ వి ద్యార్థులకు ఓ వరం జవహార్ నవోదయ విద్యాలయం. కేంద్ర ప్రభుత్వం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నవోదయ సమితి విభాగం ద్వారా 2025 ఆగస్టు నెలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నవోదయ పాఠశాలను మంజూరు చేసింది. దీంతో అధికారిక పాఠశాల భవన నిర్మాణం పనులు అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో రూ. కోట్ల రూపాయలు వ్యయంతో 30 ఎకరాల్లో జరుగుతుండగా.. 2025-26 విద్యా సంవత్సరం నుండి నవోదయ తరగతులను కరకగూడెం మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలను మరమ్మతులు చేపట్టి తాత్కలిక భవనంలో విద్యార్థులకు వసతి సౌకర్యంతో పాటు క్లాసులు నిర్వహిస్తున్నారు. 2025-26, 2026-27 నవోదయ ప్రవేశ పరీక్షలో ఎంపికై న విద్యార్థులకు చక్కటి బోధనతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇందులో భాగంగా 2027-28 విద్యాసంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాలకు ఇటీవల నవోదయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఎలా చేసుకోవాలి? విద్యాలయంలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, రిజరేషన్లు, తదితర వివరాలపై ‘ నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశం లభిస్తే ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా అన్ని సౌకర్యాలతో విలువలతో కూడిన విద్యను అభ్యసించవచ్చు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నవోదయ విద్యాలయ సమితి పాఠశాలలను నిర్వహిస్తుంది. త్రిభాషా సూత్రం అమలు ద్వారా తెలుగు, ఆంగ్లం, హిందీ భాషలపై విద్యార్థులకు పట్టు లభిస్తుంది. విద్యార్థులకు విలువతో కూడిన విద్యను బోధిస్తు పూర్తి క్రమ శిక్షణతో పాటు మెరుగైన బోధనను ఉపాధ్యాయులు అందిస్తారు.

ఏజేన్సీ విద్యార్థులకు వరం ‘నవోదయం’
జవహార్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు పూర్తిగా సీబీఎస్ఈ సిలబస్ బోధన జరుగుతుంది. బాల బాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు ఉంటాయి. ఉచిత విద్య, స్కౌట్స్ గైడ్స్, ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలతో పాటు ఉన్నత విద్యార్హత, కంప్యూటర్ విద్య, క్రీడలు, యోగా ఆసనాలు, ధ్యానం, చిత్రలేఖనం, సంగీతం, ఎన్ సిసి, ఎన్ఎస్ఎస్, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇతర సదుపాయాలన్ని కల్పిస్తారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో భోదనతో పాటు ప్రత్యేక శిక్షణ చక్కటి మెనూతో కూడిన భోజనం ఉంటుంది. నవోదయ పాఠశాలకు కేటాయించిన సీట్లకు గానూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయిస్తారు. దివ్యాంగులకు 3 శాతం, షెడ్యూల్డ్ కులాలకు 15శాతం రిజర్వేషన్ ఉంటుంది. బాలికలకు 33 శాతం సీట్లు రిజర్వేషన్ అమలు చేస్తారు. బ్లాక్ వారీగా వి ద్యార్థుల మెరిట్ ఆధారంగా ఫలితాలు ఆన్లైన్లో వెల్లడిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో నవంబర్ 28న ప్రవేశ పరీక్ష ఉంటుంది. సీటు సాధించిన విద్యార్థులు 6 నుండి 12 వ తరగతి వరకు ఉచిత విద్య, వసతి సౌకర్యం ఉంటుంది.
ఆరో తగరతిలో ప్రవేశానికి నవోదయ విద్యాలయ సమితి నిర్వహించే ప్రవేశ పరీక్షకు విద్యార్థులు ఈ అర్హతలు కలిగి ఉండాలి. 2027- 28 విద్యా సంవత్సరంలో ఆరో తగరతిలో ప్రవేశాలకు ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసు కోవాలి. 01-05-2015 నుంచి 31-07- 2017 మధ్య జన్మించిన వారు అర్హులు. నవోదయ విద్యాలయాల అధికారిక వైబ్‌సైట్ (https://navodaya. gov.in నుంచి దరఖాస్తు డౌన్ లోడ్ చేసుకుని వివరాలు పూర్తి చేయాలి. దరఖాస్తు చేసేందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. విద్యార్థి ఫోటో, సంతకం, తండ్రి సంతకం, తప్పనిసరి, పూర్తి చేసిన దరఖాస్తును వెబ్ సైట్ లో ఈ నెల జూలై 31లోగా అప్ లోడ్
చేయాలి.
నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌కు అవకాశం ఉంటుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నాం. 2027-2028 విద్యా సంవత్సరా నికి గానూ నవోదయలో కేటాయించిన సీట్లలో ప్రవేశానికి ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థుల తల్లిందండ్రులు గమనించి గడువు లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నవంబర్ 28న ఆఫ్ లైన్ విధానంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. వంద మార్కులకు 80 అబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 1.25 మార్కులు ఉంటాయి. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

ఏజేన్సీ విద్యార్థులకు వరం ‘నవోదయం’