రామగిరి, జూలై 15 : నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని చిన్నమాదారం ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు, ప్రముఖ బాల సాహితీవేత్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసిన “కంప్యూటర్ పిల్లలం” గేయానికి మహారాష్ట్ర రాష్ట్ర పాఠ్య పుస్తకంలో చోటు దక్కింది. ఆయన రచించిన ప్రముఖ బాలగేయాల పుస్తకం “ఊగుతున్న ఉయ్యాల” నుండి ఈ గేయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి గాను నాల్గొవ తరగతి తెలుగు ‘బాల భారతి’ పాఠ్య పుస్తకంలో పాఠ్యాంశంగా ప్రచురించింది. గత 20 సంవత్సరాలకు పైగా బాల సాహిత్య రంగంలో నిరంతరం రచనలు చేస్తూ, పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్న బుచ్చిరెడ్డి రాసిన గేయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశంగా ఎంపిక చేయడం విశేషం. తన గేయం పొరుగు రాష్ట్ర పాఠ్య పుస్తకంలో చేర్చడం చాలా సంతోషంగా ఉందని, ఇది బాల సాహిత్యంపై తనకు మరింత బాధ్యతను పెంచిందని రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డి రాసిన బాలగేయం మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో ఎంపిక కావడం పట్ల స్థానిక కవులు, రచయితలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఉపాధ్యాయుడు బుచ్చిరెడ్డి గేయానికి గౌరవం.. మహారాష్ట్ర పాఠ్య పుస్తకంలో ‘కంప్యూటర్ పిల్లలం’