– ప్రభుత్వ ఆస్పత్రి సమస్యలపై నిరసన దీక్ష
– వైద్య సేవలు మెరుగుపరచాలి
– బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి రావులపల్లి డిమాండ్
– ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి
– బీఆర్ఎస్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు మానె రామకృష్ణ
భద్రాచలం, జూలై 15 : ఆస్పత్రిలో అంతులేని సమస్యలు.. అడుగడుగునా రోగుల అవస్థలు.. ప్రజల గోడును పసిగట్టిన బీఆర్ఎస్ పోరాట శంఖం పూరించింది. భద్రాచలం ఏరియా ఆస్పత్రి దుస్థితిపై రణభేరి మోగిస్తూ నిరసన దీక్షకు శ్రీకారం చుట్టింది. వైద్యుల కొరత, సిబ్బంది లేకపోవడం, మౌలిక వసతుల లేమితో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడుతూ, వెంటనే సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట రణబేరి నిరసన దీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత, రోగులకు సరైన వైద్య సేవలు అందకపోవడం, అత్యవసర వైద్య సౌకర్యాల లేమి వంటి సమస్యలపై పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఆస్పత్రి పరిస్థితులపై పలు నివేదికలు వెలువడిన నేపథ్యంలో ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు.

భద్రాచలం ఏరియా ఆస్పత్రి దుస్థితిపై బీఆర్ఎస్ రణబేరి
ఈ సందర్భంగా బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించే కీలక ఆస్పత్రిగా ఉన్న భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి, అవసరమైన సిబ్బంది, ఆధునిక వైద్య పరికరాలు, మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే ఆస్పత్రి ప్రగతికి చర్యలు తీసుకున్న పాపాన పోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు మానే రామకృష్ణ మాట్లాడుతూ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైద్యుల కొరత, పరికరాల లేమి, రోగులకు సరైన సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడకూడదని హెచ్చరించిన బీఆర్ఎస్ నాయకులు, సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతమైన ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.

భద్రాచలం ఏరియా ఆస్పత్రి దుస్థితిపై బీఆర్ఎస్ రణబేరి
ఈ దీక్షకి తెలంగాణ ఉద్యమ నాయకులు తిప్పన సిద్ధులు, ఆదివాసీ నాయకులు మాజీ జడ్పీటీసీ గుండు శరత్ బాబు, భద్రాచలం ఆదివాసి కమిటీ నాయకులు పూనెం వీరభద్రం, పాయం రవి వర్మ, ప్రముఖ వ్యాపారవేత్త యశోద నగేష్, మాల మహానాడు నాయకుడు దాసరి శేఖర్, పలువురు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు ఆకోజు సునీల్ కుమార్, వార్డు సభ్యులు కావూరి గోపి, రేపాక పూర్ణచంద్రరావు, సీనియర్ నాయకులు కోటగిరి ప్రమోద్ కుమార్, గోసుల శ్రీనివాస్, ఉడత రమేష్, తుమ్మలపల్లి ధనేశ్వరరావు, కొల్లం జయ ప్రేమ్ కుమార్, రావూరి రవి కిరణ్, కాపుల సూరిబాబు, కొండముక్కల సాయిబాబా, మురాల ప్రదీప్, చిట్టి మల్ల అనిల్, అయినాల రామకృష్ణ,అప్పారావు,రుద్రరామరాజు, మహిళా నాయకులు కావూరి సీతామహాలక్ష్మి, ఎండి ముంతాజ్ మాజీ ఎంపీపీ ఊకె శాంతమ్మ, కణితి రాధా సలోమి తెలం కామేశ్వరి, రహీమా, ములకలపల్లి మదారి, కాటిబోయిన నర్సమ్మ పాల్గొన్నారు.