రామవరం, నవంబర్ 24 : జిల్లాలో నీటి సంరక్షణకు చేపట్టిన ప్రతి కార్యక్రమం అధికారుల నిబద్ధత, గ్రామస్థాయి వర్గాల ప్రాముఖ్యతతో విజయవంతమైందని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా నీటి సంరక్షణలో సాధించిన విశిష్ట విజయాలకు గాను ప్రతిష్ఠాత్మక ‘జల్ సంచయ్–జన్ భాగీదారీ’ జాతీయస్థాయిలో మూడో జోన్‌కు చెందిన కేటగిరీ–3లో రాష్ట్రంలో మొదటి స్థానాన్ని సాధించడం, విశిష్ట ఫలితానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం రూ.25 లక్షల నగదు బహుమతిని ప్రకటించిన సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మొదట తక్కువ ఖర్చుతో ఇంకుడు గుంతలు ఎలా తవ్వాలన్న దానిపై పరిశీలన జరిపి ఎంపీడీఓలు ప్రతిపాదించిన మోడల్‌ను అమలులోకి తీసుకువచ్చామని, తర్వాత ఉపాధి హామీ కూలీలు, పంచాయతీ వర్కర్లతో ప్రత్యక్షంగా పాల్గొనడంతో త్రవ్వకాలలో ఎదురయ్యే సమస్యలను గుర్తించగలిగినట్లు చెప్పారు. పనికి కావాల్సిన చిన్న పరికరాలు కూడా అందుబాటులో లేకపోవడంతో “పలుగు, పారా” పరికరాలను జిల్లావ్యాప్తంగా పంపిణీ చేసి కూలీలకు సహాయంగా నిలిచామన్నారు. పంచాయతీ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లతో ప్రారంభమై ఒక ఉద్యమంలా అన్ని శాఖల సమన్వయంతో జిల్లావ్యాప్తంగా విస్తరించి, జాతీయస్థాయిలో జిల్లాకు ప్రతిష్ఠాత్మక అవార్డు అందించిందని చెప్పారు.
భూగర్భ జలాల పరిరక్షణ, వ్యవసాయానికి నీటి అందుబాటును పెంచడం, వర్షపు నీరు భూమిలో చేరేలా చేయడం అసలు ఉద్దేశమని కలెక్టర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.25 లక్షల బహుమతిని కూలీలకు త్రవ్వకాల భారాన్ని తగ్గించే యంత్ర పరికరాల కొనుగోళ్లకు వినియోగించాలని సూచించారు. అలాగే జిల్లాలో ఇప్పటికే తవ్విన ఇంకుడు గుంతలను శుభ్రపరిచే కార్యక్రమాలు ప్రారంభించాలని, బయోచార్, ఫామ్ పౌండ్ల నిర్మాణం ద్వారా నేల సారాన్ని కాపాడి భూభాగ సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. బయో చార్ట్ తయారీ అలాగే ఫామ్ పాండ్ తవ్వకం ద్వారా మట్టిని కాపాడాలని దాని ద్వారా రైతులు అభివృద్ధి చెందుతారని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాకు జాతీయస్థాయి గుర్తింపు తీసుకువచ్చిన జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ సిబ్బంది, వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ, వైద్యశాఖ, ఇరిగేషన్, సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేసి సత్కరించారు. నీటి సంరక్షణ ఉద్యమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఈ ఉత్సాహం, ఈ కృషి ఇదే విధంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సెంట్రల్ వాటర్ బోర్డ్ కమిషన్ మెంబర్ పృథ్వీరాజ్ పాల్గొన్నారు.