హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయడం ప్రజాద్రోహమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. పవన్‌కల్యాణ్ పరిపక్వతలేని వ్యాఖ్యలు తెలుగు ప్రజల మధ్య అనవసర ఉద్రిక్తతలు సృష్టించేలా ఉన్నాయని మండిపడ్డారు.
తెలంగాణ అవతరణ దినోత్సవం రోజునే వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వెనుక దాగి ఉన్న ఎజెండా ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల మధ్య సోదరభావాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై అక్రమ కేసులను నిరసిస్తూ నేడు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తామని కూనంనేని తెలిపారు.
హైదరాబాద్, జూన్ 3(నమస్తే తెలంగాణ) : పవన్‌కల్యాణ్ తన హోదాకు తగ్గట్టు హుందాగా వ్యవహరించడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ తప్పుబట్టారు. ఆంధ్ర రాష్ట్ర సమస్యలపై దృష్టిపెట్టకుండా కేవలం తెలుగు రాష్ర్టాల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడమేమిటని బుధవారం ఒక ప్రకటనలో నిలదీశారు. ఓ చానల్ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరముంటే బీజేపీ గానీ, జనసేన గానీ అదే మీడియా వేదికగా ఖండించవచ్చని..

కానీ అంశం తీవ్రతను పెంచి ఆయనపై కాకినాడ, తదితర స్టేషన్లలో కేసులు పెట్టడం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంత జర్నలిస్టులు ఖండించి, నిరసనలు తెలిపారని పేర్కొన్నారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ర్టాల మధ్య ప్రాంతీయ విభేధాలు సృష్టించే పరిస్థితికి దారితీసిందని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్ మీడియా సమావేశం పెట్టి ఆవేశపూరితంగా ప్రసంగించడం అగ్గికి ఆజ్యం పోసినట్టయ్యిందని మండిపడ్డారు.