హత్నూర, జూన్ 3: పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల శివారులో బుధవారం తెరానిమ్ బయోలాజిక్స్ పరిశ్రమను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందన్నారు.
పారదర్శకత విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. బయోటెక్నాలజీ, ఔషధరంగాల్లో తెలంగాణ ఇప్పటికే దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు ఇలాంటి సంస్థలు బలాన్ని చేకూరుస్తాయన్నారు. సంగారెడ్డి జిల్లా ఔషధ, బయోటెక్నాలజీ రంగాలకు ప్రధాన కేంద్రంగా మారిందన్నారు.
పరిశ్రమల విస్తరణతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలాజగ్గారెడ్డి, సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ పాండు, అరబిందో ఫార్మా సంస్థల చైర్మన్ నిత్యానందరెడ్డి, సంస్థ ప్రతినిధులు శరథ్చంద్రారెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, శతకర్ణి మక్కపాటి, డీఎస్పీ ప్రభాకర్, తహసీల్దార్ ఫర్హీన్‌షేక్ పాల్గొన్నారు.