హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సిటీ సైబర్‌క్రైమ్ డీసీపీ అరవింద్బాబుపై బదిలీ వేటు పడింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత కీలకమైన సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అధికారి అరవింద్బాబుపై హఠాత్తుగా బదిలీ వేటు పడటం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల హైదరాబాద్ సైబర్‌క్రైమ్‌లో నమోదైన రెండు వివాదాస్పద కేసులే ఆయన బదిలీకి ప్రధాన కారణమని తెలుస్తున్నది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సహా ప్రముఖ నాయకులను లక్ష్యంగా చేసుకుని కొందరు అభ్యంతరకరమైన మార్ఫింగ్ చేసిన వీడియోలు, ఫొటోలు పెట్టడంపై బీజేపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సైబర్‌క్రైమ్ స్టేషన్లో వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. వీటిపై దర్యాప్తు జరిపిన పోలీసులు ‘మెటా’ ఇండియా హెడ్‌తోపాటు 20కిపైగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై కేసులు నమోదు చేశారు.
విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు తెలిపిన నేపథ్యంలో ఈ కేసులు నమోదు చేయడం తమకు నచ్చలేదని సీఎం కార్యాలయ ఉన్నతాధికారులతోపాటు పోలీస్ బాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. రాజకీయ ప్రచారాలు, సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల ఆధారంగా కార్పొరేట్ దిగ్గజాలపై కేసులు నమోదు చేయడంలో పాటించాల్సిన మార్గదర్శకాలు, ముందస్తు అనుమతుల విషయంలో సరిగా వ్యవహరించలేదని పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అరవింద్‌బాబును సైబర్‌క్రైమ్ డీసీపీ బాధ్యతల నుంచి తప్పించి, వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్టు తెలుస్తున్నది.