జూలూరుపాడు, ఫిబ్రవరి 14: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని (Kothagudem) జూలూరుపాడులో ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి నగదు మాయమైంది. మండల కేంద్రంలోని కోయ కాలనీకి చెందిన మల్కం మహేష్ ఖాతాలో రూ.70వేలు నగదును సైబర్ నేరగాళ్లు మాయం చేశారు. దీంతో బాధితుడు కొత్తగూడెం పట్టణంలోని చుంచుపల్లి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకెళ్తే..
జూలూరుపాడు గ్రామంలోని కోయ కాలనీకి చెందిన మహేష్ హమాలీ పనితో పాటు ప్రైవేట్ బస్సు డ్రైవర్గా చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తను ఎస్బిఐ ఖాతాలో జనవరి 22న రూ.11 వేల నగదును పేపాయింట్ వద్ద డ్రా చేశాడు. దీంతో అతనికి ఖాతాలో రూ .70 వేల 208 నిల్వ ఉన్నట్టు మొబైల్కు మెసేజ్ వచ్చింది. తిరిగి ఫిబ్రవరి 12న కొత్తగూడెంలోని పే పాయింట్ వద్దకు వెళ్లి నగదు డ్రా చేసేందుకు వెళ్లగా అకౌంట్లో రూ.38 మాత్రమే ఉన్నట్లు గుర్తించాడు. తన ఖాతాలో నగదు మాయమైనట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.