రామవరం ,ఏప్రిల్ 12 : ప్రకృతి ప్రేమికుడిగా, చెట్ల మనిషిగా, కోటి మొక్కలు నాటిక వ్యక్తిగా, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య (87) అకాల మరణం యావత్ సమాజానికి దిగ్భ్రాంతిని కలిగించిందని మొక్కల వెంకటయ్య అన్నారు. బ్రతికినంత కాలం చెట్ల పెంపకమే తన ఊపిరిగా రామయ్య బతికారని, ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తుండేవారని, జననమైన మరణమైన దాని గుర్తుగా ప్రతి మనిషి ఒక మొక్కను నాటి దత్తత తీసుకుని పెంచి సమాజానికి అందించాలని తెలిపారు.
ఆయన ఇచ్చిన పిలుపుని అందుకుని రామయ్య మరణ వార్త విన్న వెంటనే ఆయన పేరు మీద కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీబీ నగర్లో మొక్కల వెంకటయ్య మొక్కల ప్రాంగణంలో మొక్కలు నాటామని తెలిపారు. పర్యావరణ పరిరక్షకులు విధిగా ఆయన పేరుమీద ఒక మొక్కను నాటాలని, నాటి దాని సంరక్షణ బాధ్యతను తీసుకుంటే రామయ్యకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో రామవరం పరిరక్షణ కమిటీ సభ్యులు ముస్తఫా, గోరంట్ల సుగుణ రావు పాల్గొన్నారు.