రామవరం, మే 17 : మానవ సేవే.. మాధవ సేవ అని నమ్మి కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని బూడిదిగడ్డకు చెందిన మొహమ్మద్ ‘ఇబ్రహీం ఖిద్మతే ఇన్సానియత్ వెల్ఫేర్ సొసైటీ’ని స్థాపించాడు. ఈ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడు. వేసవి నేపథ్యంలో రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రం అలాగే కొత్తగూడెం ప్రధాన ఆస్పత్రిలో రోజుకు 50 కూల్ వాటర్ క్యాన్ల చొప్పున సుమారు రూ.3 వేలు వెచ్చిస్తూ పేషెంట్లకు, వారి సహాయకులకు చల్లని ప్యూరిఫైడ్ నీటిని అందిస్తున్నాడు. ఇందు కోసం నిర్వాహకులను ఏర్పాటు చేసి వారికి రూ.6 వేల చొప్పున జీతాన్ని కూడా అందజేస్తున్నాడు.
అంతేకాకుండా ఎవరైనా చనిపోతే ఉచితంగా ఫ్రీజర్ బాక్స్‌తో పాటు, అంబులెన్స్ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. అంబులెన్స్ లో పెట్రోలు, డ్రైవర్ బేటా చెల్లించి ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు అని తెలిపారు. తమ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎవరైనా పేదలు వైద్య సాయం కోసం ఎదురుచూస్తున్నట్లైతే వారి వివరాలను గ్రూపులో తెలిపితే ఆర్థిక సహాయాన్ని అందజేస్తామన్నారు. సహాయం కావాలనుకునే వారు 9000578632 నంబర్‌ను సంప్రదించవచ్చు అని తెలిపారు. గత రెండు సంవత్సరాల నుండి పైసా ఆశించకుండా ఉచితంగా సేవ చేస్తున్నట్టు ఇబ్రహీం తెలిపాడు.