కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 13 : ప్రధాని మోదీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, కార్పొరేట్స్ భారత వ్యవసాయాన్ని విడిచి పెట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక చట్టాలను రద్దు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా సంఘం నాయకులు చుంచుపల్లి మండలం నుండి లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డు వరకు మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. అమెరికా భారీగా సుంకాలు విధిస్తున్నా ప్రధాని మోదీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు దుయ్యబట్టారు. మరోవైపు బ్రిటన్‌తో భారతదేశం ఆహార ప్రాసెసింగ్‌లో ఎఫ్ డీ ఈ ని కూడా పెంచిందని, ఇది రైతుల ఆదాయాలను, చిన్న వ్యవసాయ వ్యాపారాలను దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
జన్యుమార్పిడి పంటల (ఆహార ధాన్యాలు, సోయా, మొక్కజొన్న, పత్తి) భారీ దిగుమతులను ప్రోత్సహించడానికి, భారత ఆర్థిక వ్యవస్థలోకి బహుళజాతి సంస్థల నియంత్రణ లేని ప్రవేశాన్ని ప్రోత్సహించడానికి అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని, ఈ చర్యను తీవ్రంగా నిరసిస్తున్నట్లు తెలిపారు. రైతులు పెట్టిన పెట్టుబడికి 50 శాతం కలిపి మద్దతు ధరల చట్టం చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలన్నారు. సమగ్ర రుణ మాఫీ, మైక్రో ఫైనాన్స్ కంపెనీల వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. రైతు, వ్యవసాయ కార్మికుల కుటుంబాలకు వడ్డీ లేని రుణాలు అందించడానికి, గ్రామాల్లో ఉత్పత్తిదారుల సహకార సంఘాలను స్థాపించడానికి, సంవత్సరానికి 4 శాతం వడ్డీతో ఎంఎఫ్ఐ రుణాలను నియంత్రించడానికి చట్టం తీసుకురావాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల నాయకులు జలీల్, ముత్యాల విశ్వనాథం, కంచర్ల జమలయ్య, అన్నవరపు సత్యనారాయణ, భూక్య రమేశ్, ముద్ద భిక్షం, షేక్ యాకుబ్ షావలి, కొక్కు సారంగపాని, భూక్య హర్జ, కందగట్ల సురేందర్, ఉప్పరబోయిన రామ్మూర్తి, కాలం నాగభూషణం, చంద్ర నరేందర్ నరాటి ప్రసాద్, గెద్దాడి నగేశ్, వీర్ల రమేశ్, గోగ్గల సుధీర్, బుర్ర వెంకన్న, నూప భాస్కర్, ఏదులాపురం గోపాలరావు, నెమళ్ల సంజీవ్, జాటోత్ మంగీలాల్, నెమలి రాంబాబు, ఇట్టి వెంకట్రావు, మేడుదుల రాజశేఖర్, లక్ష్మీపతి, బాలు, బచ్చలకొర శీను, గండమల్ల భాస్కర్, జే.వెంకటేశ్వర్లు, శంకర్ కమల్, గౌస్ జానీ పాల్గొన్నారు.